ఒక జ్యోతిని వెలిగించాలంటే జ్యోతియే అవసరం. అలాగే మనం ధర్మ మార్గంలో చరించాలంటే ఒక తపస్వియైన సద్గురువు, సనాతన ధర్మమార్గాన్ని అవలంబిస్తున్న సత్య గురువు మాత్రమే మార్గదర్శకులవగలరు. ఆచార్యులైన అటువంటి సద్గురువులు “శ్రీశ్రీశ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద మహరాజ్” శ్రీ దత్త సంప్రదాయంలో ఉన్నారు. వీరు కుటుంబం, సంసారం లో ఉంటూనే ఆద్యాత్మికానందంలో ఓలలాడుతూ ఉంటారు. మన మధ్యనే సంచరిస్తూ వారి ఉనికిని మహత్యాన్ని గుప్తంగా ఉంచుతారు.
సద్గురువులు ఒక సశాస్త్రీయమైన బ్రాహ్మణ కుటుంబములో శ్రీ సీతారామ శాస్త్రి గారు, శ్రీమతి పార్వతి దంపతులకు 03-11-1959 కార్తీక శుద్ధ తదియ నాడు శ్రీ బొడ్డుపల్లి వేంకట సుబ్రహ్మణ్య ప్రసాదు గా జన్మించారు. వారి పిత్రుదేవులు స్మార్త, వాస్తు , వేద పండితులు.శ్రీ గురుని అనుగ్రహమున ఉపాస్య దేవత ఆశీస్సుల వలన గురువుగారి నిత్య జీవన స్రవంతిలో నిత్యానుష్ఠానము, ప్రతి మాసమున పౌర్ణమి సద్గురు వేదికలు, వేద పండితులచే సద్గురు వేదసభలు, సద్గోష్ఠిగా సత్సంగం జరిపి శిష్య గణమును, ఆశీర్వదిస్తున్నారు. మా ఆద్యాత్మిక లక్ష్యం కొరకు, లౌకికమైన సమస్యల పరిష్కారాల కొరకు, సమస్యలలొ ఉన్నవారికి జ్యొతిష్య పరమైన సూచనలు ఇస్తూ సద్గురు భావనతొ దరిచేరిన వారిని వివక్షత లేకుండా అనుగ్రహిస్తున్నారు.అందరిలో ఆద్యాత్మిక చింతనను పెంపొందిచుటకు, సనాతన ధర్మం గురించిన అవగాహన కల్పించుతున్నారు. యోగమార్గమున రక్షణ కవచము ఏర్పరిచి దేశ విదేశాలందున్న శిష్యులను రక్షించుచున్నారు.
బిరుదావళి:
“స్మర్తృగామి, భక్తకామ్యకల్పద్రుమ,పరావాక్సిద్ధి సంపన్న, పరపాదుకానంద, శ్రీగురు చరణ స్మరణానంద సమర్ధ సద్గురు శ్రీ వేంకట సుబ్రహ్మణ్యానంద”
స్మర్తృగామి:“స్మర్తారం గఛ్చతీతి స్మర్తృగామి” స్మరించినవారిని శ్రీఘ్రముగా పొందువారే స్మర్తృగాములు అంటారు. ఎందుకనగా వారు స్మరణమాత్ర సంతుష్టులు, కనుక ఇట్టి సద్గురువులే సమాజమునకు, సాధకులకు అవసరము, ఆశ్రయము. సాధక లోకానుభవమునకు స్వీయానుభవములను వెల్లడి చెయుటయే స్మర్తృగామి గ్రంథ లక్ష్యము.దీనికి ఎన్నో అనుభవాలు శిష్యులంతా అనుభవించి తరిస్తున్నారు. ఇందువలననే మా సద్గురువులని స్మర్తృగామి అని పిలుచుకొంటాము.
భక్తకామ్యకల్పద్రుమకల్పవృక్షము వలే భక్తుల కామ్యములు సద్గురువులని స్మరించినంతనే నెరవేరుచున్నవి.మా సద్గురువులవద్ద శిష్యగణమంతా లెక్కలేనన్ని అనుభవములు అనుభవించినారు. కొన్ని అనుభవములు వాక్కు రూపములో, మరి కొన్ని అనుభవరత్నావళి గ్రంథంలో శిష్యుల సొంత మాటలలో లోకానికి అందించబడ్డాయి. భక్తుల కామ్యములు తీర్చే కల్పవృక్షము వంటి సద్గురువులకు భక్తకామ్యకల్పద్రుమ సార్ధకతను చేకూర్చుచున్నది.
పరావాక్సిద్ధి సంపన్న మా సద్గురువుల అనుగ్రహభాషణం విన్నప్పుడు, వారి హావభావములు పరిశీలించినప్పుడు కొన్నిసార్లు జగద్గురువులే ఆశీనులయినారెమో అనబడేభావము ప్రతిబింబిస్తుంటుంది. కొన్ని మార్లు వారిలో దత్తసంప్రదాయంలో ఉన్న గురువులు మనకి దర్శనము ఇస్తూ ఉంటారు.విషయాలోచన చేసినప్పుడు గురురత్నావళి, అనుభవరత్నావళి గ్రంథాలు పరిశీలించినప్పుడు పరాశక్తి మా గురువుల వాక్కు ద్వారా పరావాక్కుగా పలుకుతోంది అని అవగతము అవుతోంది.కంచి శంకరాచార్యులలో కంచి కామాక్షిని శ్రీ కామాక్షీ మాతలో కంచి జగద్గురువులను దర్శించి తరించవచ్చు అని పదే పదే పరమానందభరితులై మా సద్గురువులు మా అందరికీ చెప్పుటయే గాక గురుమండల రూపిణిని కదిలే దైవంగా గురువుల యందు ప్రతిబింబింప చేసుకోవచ్చు అని రూఢీ చేయుటయే సద్గురువులు నిరంతరమూ పరా శక్తి పాదములను ఆశ్రయించి ఉందురని తెలియుచున్నది.అందువలన మా గురువులు పరావాక్సిద్ధి పరపాదుకానంద అను బిరుదుతో ఆ పరతత్వమే పరిచయం చేస్తున్నట్లు శిష్యుల ధ్రుడ విశ్వాసము.
పరపాదుకానంద శ్రీగురుపాదుకలు ప్రతి ఒక్కరి మూర్ధ్ని స్థానంలో ఉంటాయి. అవి భగవంతుడి యొక్క శక్తి పాదుకలు.శివశక్తుల కలయిక అయిన ఆ పాదుకలు ఒకటి అమ్మ వారిది (అరుణ కాంతులు), రెండొవది అయ్య వారిది (తెల్లటి కాంతులు). సదా అ పాదుకలను దర్శిస్తు తన దరి చేరిన శిష్యులు, భక్తుల యందు కూడా దర్శించి పరానందము పొందు మా సద్గురువులను, పరపాదుకానంద బిరుదుతో శ్లాఘించుట అతిశయోక్తి కానే కాదు.
శ్రీగురు చరణ స్మరణానంద, సమర్ధ సద్గురు శ్రీదత్తాత్రేయ సంప్రదాయంలోని గురువులను శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహసరస్వతీ స్వామి, శ్రీ మాణిక్య ప్రభువులు, శ్రీ సాయి నాధులు, అక్కలకోట స్వామి సమర్థ ప్రభువులు, శ్రీ గజానన మహరాజ్, శ్రీ ఉపాసిని బాబా మొదలగుగాగల సకల సద్గురువులను నిరంతరము స్మరిస్తూవుంటారు. శ్రీ గురుని స్మరణ చేసినంతనే మా సద్గురువుల ముఖమండలముపై ఆనంద తన్మయత్వము గోచరిస్తుంది.
అంతరంలో యోగనిష్టులై బాహ్యంలో సాధారణ వ్యక్తి వలే సంచరించు సద్గురువులు అందరినీ అభివృద్ది పథములో నడిపించుటకు, సాధక లోకమునకు సాధనా పరమైన విషయాలు విశదీకరించుటకు వేదికగా ప్రతీ పౌర్ణమి కీ “సద్గురు వేదిక” నిర్వహించబడుతోంది.
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం” అనబడే శాస్త్ర ప్రమాణముగా శివాజీ స్ఫూర్తి కేంద్రం ఆవరణలో బిల్వ వృక్ష ఛాయలో మన సద్గురువులచే ” శ్రీ గిరి భ్రమరాంబికా వరద మల్లికార్జున” బాణలింగ ప్రతిష్ఠ సద్గురువుల జన్మదినోత్సవ ముహూర్తమున చేయబడి సర్వ మానవాళి శ్రేయస్సు కోసం, మనమందరము వరసిద్దులు పొందడం కోసం అంకితం చేయబడినది.
“గురు రత్నావళి” గ్రంథం గురువుగారిచే భగవత్ ప్రేరణతొ వ్రాయబడినది. సనాతన ధర్మ రక్షణనే లక్ష్యంగా పెట్టుకుని, దాన్ని ప్రచారం చేయటం కోసం ఈ గ్రంథం వెలుగులోకి వచ్చింది. ఈ గ్రంథం సనాతన వాణి. మనలను ఆర్ష ధర్మం వైపు ఆకర్షిస్తుంది. ఈ గ్రంథం గురువు యొక్క ప్రాముఖ్యత, వైభవం, విశిష్ఠత తెలియజేస్తే, వాటిని నిజంగా అనుభవంలొ రుచి చూసిన శిష్యుల మనోభావాలు ఋజువువలే, సాక్ష్యం వలె ఆ సాధనరాణిని స్వయం సోధనబాణిని నిరూపిస్తున్నాయి. శిష్యుల ఆధ్యాత్మికమయిన అనుభవాలను పొందు పరచిన పుస్తకమే “అనుభవ రత్నావళి” . ఆ పుస్తకం ద్వారా శిష్యుల చేత వారి సొంత మాటలలొ వారి అనుభవాలను రాయించటమనేది చాలా వినూత్నమయిన ప్రక్రియ. భగవంతుడు భక్తుల ద్వారానే తెలుస్తాడు. మమూలుగా పుస్తకాలు చదివి గురుతత్వం అర్థం చేసుకోవటం చాలా కష్టం. కాని గురువు యొక్క అనుగ్రహాన్ని అనుభవించి అర్థం చేసుకోవటం చాలా సులభం.
ఆధ్యాత్మిక ఉత్సాహము ఉన్నవారు శిష్యులచే రూపు దాల్చిన ఈ వెబ్ సైట్ ను పరిశీలించగలరు. గురువు గారిచే ఇవ్వబడిన అనుగ్రహ భాషణములు, కొంత మంది శిష్యుల అనుభవాలు, వివిధ ప్రదేశాలలో నిర్వహించిన సద్గురు వేదికల ఫొటోలు, వీడియోలు ఈ వెబ్ సైట్ లో కలవు.