ఈశ్వరుడి ఊపిరి అయిన వేదములే ఆయువు పట్టుగా గల సనాతన ధర్మము, కన్న తల్లిని ఈ వేద భూమిలో అత్యున్నతమైన ఆసనము మీద కూర్చోపెట్టి సత్కరించింది. భారతదేశములో అందరికన్నా అత్యున్నత స్థానములో ఉన్నది దేశ అధ్యక్షుడు “రాష్ట్రపతి”. అటువంటి రాష్ట్రపతి ఎదురైతే ఎవరైనా ప్రథమ నమస్కారం చేయాల్సిందే. రాష్ట్రపతి వస్తుంటే ప్రధానమంత్రి ఎదురైనా, మొదటి నమస్కారము ప్రధానమంత్రే రాష్ట్రపతికి చేయాల్సి ఉంటుంది. 
అదే రాష్ట్రపతి వస్తున్నప్పుడు ఒక సన్యాసి ఎదురైతే, అప్పుడు మొదటి నమస్కారం రాష్ట్రపతి, సర్వం త్యజించిన ఆ సన్యాసికి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సనాతన ధర్మము, దేశాధ్యక్షుడు కన్నా సన్యాసికి ఉన్నత స్థానము ఇచ్చి గౌరవము ఇచ్చింది.
అదే సన్యాసి వెళుతుంటే, ఆ సన్యాసి కన్నా ఎక్కువ చాతుర్మాస దీక్షలు చేసిన సన్యాసి ఎదురైతే, ప్రథమ నమస్కారం తక్కువ చాతుర్మాస దీక్షలు చేసిన సన్యాసి చేయాల్సి ఉంటుంది.
కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు, నడిచే దైవం అయిన జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, అందరిచేత “మహాపెరియవ” అని పిలవబడిన పరమాచార్య స్వామి, తన 13వ ఏటనే సన్యాసాశ్రమము స్వీకరించి శతాయుష్కులై మానవజాతిని ధర్మం వైపు మరల్చారు.
మహాపెరియవ చేసినన్ని చాతుర్మాస దీక్షలు ఎవరు చేయలేదు. పరమాచార్య స్వామివారు ఉన్న రోజులలో, ఆయన మస్కరించడానికి మనిషి ఎవరూ లేరు. ఏ మహాత్ముడైతే ఈ భూమి మీద అపర శివావతారమై నడయాడారో, ఏ సాధుపుంగవుడి పేరు తలచినంత మాత్రముచేత పాపరాశి భస్మమై పోతుందో, ఏ మహానుభావుడైతే సన్యాసాశ్రమమునకు నిలువెత్తుటి తార్కాణముగా నిలిచారో, ఏ యుగపురుషుడైతే సనాతన ధర్మము యొక్క వైభవాన్ని ప్రపంచం నలుదిశలా చాటారో, ఏ మహితాత్ముడైతే 87 చాతుర్మాస దీక్షలు చేసి, అందరిచే దైవాంశ సంభూతుడుగా కొలవబడుతూ, పూజలు అందుకుంటున్నారో, అంతటి గొప్ప సన్యాసి అయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా తల్లి ఎదురైతే, అంతటి సన్యాసే తల్లికి మొదటి నమస్కారము చేయాల్సి ఉంటుంది.
సనాతన ధర్మము తల్లికి సమాజములో అంతటి ఉన్నత స్థానమిచ్చి గౌరవించింది.